Asianet NewsableAsianet Newsable

ముందంతా ‘క్యాష్ లెస్’ వైపరీత్యమే

cashless disaster staring in to the eyes of the nation

 

.

సరిగ్గా నెలరోజుల క్రిందట "నల్లధనం పై పోరాటం" అన్న మోడీ ప్రకటనతో మొదలై, "నగదురహిత లావాదేవీలు" అంటూ నిన్నటి "అరుణ్ జైట్లీ" ప్రకటన వరకూ లెక్కలేనన్ని పిల్లిమొగ్గలు వేశారు కేంద్ర పెద్దలు.

 

నోట్ల రద్దు సరైనదా కాదా అన్నది అప్రస్తుతం. మంచో చెడో తీసుకోవాల్సిన నిర్ణయమేదో తీసేసుకొన్నారు. దానిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కానీ, ప్రత్యామ్నాయం ఏమిటి అంటే మాత్రం "డిజిటల్ ట్రాంజాక్షన్స్ - నగదురహిత లావాదేవీలు" అంటూ గడుసైన సమాధానం చెబుతున్నారు. పైగా అడిగినోళ్ళకీ, అడగనోళ్ళకీ అందరికీ ఉచితసలహాలు ఇస్తూ, అదెంత సులువో గీతోపదేశం చేస్తున్నారు. అసలు "పూర్తీ క్యాష్ లెస్ లావాదేవీలు" చేయాలంటే ఉండాల్సిన "ఇన్ఫ్రాస్ట్రక్చర్" మనదగ్గర ఉందా ? దేశంలోని జనాభాకు అనుగుణంగా ఇవన్నీ సిద్ధం చేసే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా ?మనదేశ జనాభాతో పోలిస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ఆన్లైన్ సేవలను ఉపయోగించుకొంటున్న జనాభా నిష్పత్తి ఎంతశాతం ఉంది ?

.

 కానీ నిన్నటిరోజున "అరుణ్ జైట్లీ" గారు మాత్రం "గడచిన 30 రోజుల్లో కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది" అంటూ సగర్వంగా ప్రకటించేశారు. పైగా ఇలా కార్డులు వినియోగించేవారికి, ఆన్లైన్ లావాదేవీలు చేసేవారికి డిస్కౌంట్లు కూడా ప్రకటించేశారు. అసలు ఈ ప్రకటన చేయడానికి ఆయనకు సిగ్గనిపించలేదేమో మరి!. అన్నిదారులూ మూసేసి, కరెన్సీ అందుబాటులో లేకుండా చేసి, అసలు ఆల్టర్నేట్ కూడా లేకుండా చేస్తే, ఉన్న కార్డులను వినియోగించకుండా చస్తారా జనాలు ??

 

అదేదో ఈయన గొప్పదనం అన్నట్లు జబ్బలు చరుచుకొంటే ఎలా ?? - ఈయనగారు చెప్పుకొంటున్నట్లు, ఆ "పెరిగిన కార్డు వినియోగదారుల్లో ఈ దేశాజనాభాలో ఎంతశాతం మంది ఉన్నారు??" కేవలం సినిమా టీజర్ మాత్రమే చూసి రివ్యూ రాస్తేస్తే ఎలాగండీ జైట్లీగారూ ?? అట్టర్ ఫ్లాప్ సినిమాల టీజర్లు కూడా అత్యద్భుతంగా ఉంటాయి.!

 

 "ఆటగదరాశివా - ఆటగదకేశవా" అన్నట్లు, ఈ శివకేశవుల (మోడీ - జైట్లీ) ఆటలో "సామాన్యజనాలు" సమిధలవుతున్నారు. అసలు ఆ నల్లధనం ఎంతుందో - ఎక్కడుందో - ఎవరిదగ్గరుందో - ఏరూపంలో ఉందో అన్న అసలు వాస్తవాలను ప్రక్కనబెట్టి, జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి, పూటకోమాట చెబుతూ, "మంకీ బాత్" (అవును, అవన్నీ కోతి మాటలే) పేరుతో, అత్యంత నాటకీయమైన స్క్రిప్ట్ ను అంతే అద్భుతంగా చదివి వినిపించారు భగవాన్ మోడీ గారు. దేశానికి శాల్యూట్ చేస్తున్నానని పదే పదే చెబుతున్నారు. ఆయన్ని అనుసరిస్తూ, ఆయన అంతరాత్మ అయిన, శ్రీమాన్ జైట్లీ గారు ఉపాఖ్యానం చేస్తారు.

 

ఎంతసేపూ, సోత్కర్ష - ఆత్మస్తుతి - పరనింద... ఈ దేశ ప్రజలను ఎర్రిబాగులోళ్లని తీర్మానించేశారు. ఇది ప్రజాస్వామ్యంలా లేదు - రాజరికపాలనలాగా ఉంది. వీళ్ళు చెబుతున్న "అచ్చే దిన్" వస్తాయో లేవో కానీ జనాలు మాత్రం చచ్చే దినాలయి వచ్చాయి.  ఈ నెలరోజుల్లో నగదు సమస్యవల్ల దేశంలోని 90%మందికి పైగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  - ఇంత హడావిడి చేస్తున్నా, దీనిపై సభలో చర్చించే దమ్ము మాత్రం ఈ పిరికి ప్రభుత్వానికి లేదు. కేవలం ఆరోపణాలూ - ప్రత్యారోపణాలూ చేస్తూ, దబాయించడమే వీరికి తెలిసిన విద్య. 

.

 అసలు "నోట్ల రద్దు" అన్నది ఎందుకు చేశారో అన్నదానిపై మోడీగారికే స్పష్టత లేదు. పూటకోమాట మాట్లాడుతూ, చివరికి "క్యాష్ లెస్ ఇండియా"గా మారడానికే నోట్లు రద్దుచేస్తున్నట్లు, దీనివల్ల "నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలిస్తున్నట్లు" ప్రకటించేసుకొంటున్నారు. అసలు "నల్లధనం ఉన్నవాళ్ళు ఆ నల్లడబ్బుతో ఆన్లైన్ ట్రాంజాక్షన్స్ చేస్తారా" ?? .

 

సామాన్య జనాలు రెండువేల రూపాయలకోసం రోజంతా కాళ్లుపోయేలా క్యూలలో ఉంటే, మరోవైపు వందలకోట్ల కొత్త నోట్లు పట్టుబడుతున్నాయి. అసలు విషయమేమిటంటే, ఈ నల్లధనం ఉన్న బాడాబాబులు మాత్రం సునాయాసంగా వాళ్లడబ్బుని తెల్లగా మార్చేసుకొంటున్నారు. "నగదు రూపంలో ఉన్న నల్లడబ్బు సముద్రంలో కాకిరెట్ట మాత్రమే" అసలైన నల్లడబ్బు ఇతర రూపాల్లో ఉంటుంది. పెద్దోళ్ళంతా దిలాసాగా ఉంటున్నారు. అసలు సమస్యలన్నీ "సామాన్య జనాలకే".

.

..... ఇక అసలు విషయానికొస్తే, ఈ "నగదు రహిత లావాదేవీలు" అన్నది మనదేశంలో ఎంతవరకూ సాధ్యం ???

.

 ఈ దేశ జనాభాలో ఎంతమందికి బ్యాంక్ ఎకౌంట్లు ఉన్నాయి ?

 ఎంతమందికి బ్యాంక్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు ?

 అసంఘటిత రంగా కార్మికుల పరిస్థితి ఏమిటి ?

రైతుకూలీల పరిస్థితి ఏమిటి ?

 ఎంతమంది దగ్గర కార్డులు ఉన్నాయి ?

ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ?

 ఎంతమంది స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ ద్వారా లావాదేవీలు జరిపే స్థితిలో ఉన్నారు ?

 ఎంతమందికి ఇలా ఆన్లైన్ లావాదేవీలద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంది ?

 ప్రస్తుత దేశజనాభాతో పోలిస్తే, ఈ దేశంలో వినియోగంలో ఉన్న కార్డులు, పి‌ఓ‌ఎస్ మిషన్లు ఎన్ని? ఇన్నికోట్లమందికి సరిపడా ఉన్నాయా ? సిద్ధం చేయగలమా ?

 కార్డుతోబాటు, అందుబాటులో ఉన్న మిగతా రకరకాల ఆన్లైన్ చెల్లింపు విధానాలన్నీ ఎంతశాతం జనాలకు ఏమాత్రం అందుబాటులో ఉన్నాయి ?

.

.... ఇవన్నీ ఒకఎత్తు.. ఇక చిరు వ్యాపారులది మరో తీవ్రమైన సమస్య. 

.

రోడ్డుప్రక్కన బండిమీద పళ్ళు పూలు అమ్ముకొనే చిరు వ్యాపారులు, ఇంటింటికీ తిరిగి కూరగాయలు, గాజులూ, పూసలు, ప్లాస్టిక్ సామాన్లు, రగ్గులు అమ్ముకొనేవాళ్లూ, గ్యాస్ రిపేర్ చేసేవాళ్ళు, పాత పేపర్లు, చెత్తను కలెక్ట్ చేసుకొని అమ్ముకొని నాలుగు రాళ్ళు సంపాదించుకొనేవాళ్ళూ, రోడ్డుప్రక్క బండిమీదనే టీ, టిఫిన్ అమ్ముకొనేవాళ్లూ ఇలా చెప్పుకొంటూ పోతే ఓ వందపేజీలు రాయవచ్చు. - వీళ్ళందరూ ఆన్లైన్ ద్వారానే అమ్మకాలు చేయాలా ?? మెడకాయ మీద తలకాయ ఉందా మీకసలు ?? ఏం మాట్లాడుతున్నారు ??? 

.

2004 ఎన్నికల ముందుకూడా ఇలానే "భారత్ వెలిగిపోతుంది - ఇండియా షైనింగ్" అంటూ అడ్డగోలుగా వాగితేనే పదేళ్ళు అధికారానికి దూరం కావలసి వచ్చింది.. ఇక కాసుకోండి, 2019 వరకూ అవసరం లేదు,  వచ్చే ఏడాదిలోనే రాబోయే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మీరు ఆత్మహత్యచేసుకోవడం ఖాయం.. రాసిపెట్టుకోండి.. 

.

.... ఇంకా చాలా రాయాలని ఉంది, కానీ ఆగ్రహంలో మాటలు రావడం లేదు.. కానీ ఒక్కటి మాత్రం నిజం... జనాల ఆలోచనలను, సమస్యలను, ఇబ్బందులనూ కనీసం అర్థం చేసుకొనే ప్రయత్నం చేయకుండా, ఇలా గాల్లో మేడలు కట్టుకొంటూ ఊహాజనిత ప్రపంచంలో విహరిస్తూ పిచ్చి తుగ్లక్ లాగా చిత్తమొచ్చినట్లు ప్రవర్తిస్తే, వాళ్లవంతు వచ్చినప్పుడు జనాలు బాగా కాల్చి వాతపెట్టడం ఖాయం.. జాగ్రత్త.. 

.

... దేశభక్తులకు ఇవన్నీ అనవసరం.. ఇలా మాట్లాడేవాళ్లని దేశద్రోహులు అంటూ ముద్ర వేయడమే. ఖమాన్ గో అహేడ్..!